ప్రస్థాన సాధన
(ద ప్రాసెస్ అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద ఎసెన్సన్)
మనసు మార్పుకు శాస్త్రీయ విధానం
శరీర ఆరోగ్యం, మానసిక ప్రశాంత కొరకు యోగా, ప్రాణాయామం, ధ్యానం లాంటివి అందరికీ సుపరిచితమె! అయితే ఆ మూడింటి మేలుకలయికగా, ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు శాస్త్రీయ వివరణలతో, సూత్రబద్దంగా “ప్రస్థాన సాధన” పేరుతో సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు.
మనిషి, మానవ జీవితానికి సంబందించి ‘మనసు’ వారధి, సారధి, మానసిక స్థాయి, స్థితిని బట్టి, మనిషి యొక్క తెలివి, విచక్షణ, బుద్ధి, మేదస్సు, జ్ఞానం ఆధారపడి ఉంటాయి. అటువంటి మనసును ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేసుకెళ్లడానికి ధ్యానం ఉపయుక్తంగా ఉంటుంది.
అయితే శరీర సహకారం లేకుండా ధ్యానం చేయడం కుదరదు. అందుకే యోగాతో, శరీరాన్ని వివిధ భంగిమలలో సూత్రబద్దంగా మలచడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి, శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రాణాయామం ద్వారా అధిక ప్రాణవాయువు శ్వాసించడం వలన, అది రక్తంతో కలిసి, శరీరంలోని వ్యాధి కారకాలు, మలినాలు తొలగింపబడటంతో పాటు, ప్రాణశక్తి స్థాయిలు పెరిగి, తద్వారా మెదడులోని నాడీ కణాలు (న్యూరాన్స్) శక్తివంతం అవుతాయి. ఈ రకంగా యోగాతో ఆరోగ్యవంతమైన శరీరం, ప్రాణాయామంతో, శక్తివంతమైన మనసును సముపార్జించుకుని, ధ్యానంలో కూర్చుంటే, అప్పుడు మనసు పరివర్తన జరిగి, అది ఉన్నతంగా ప్రస్థానం చెందుతుంది అని శాస్త్రబద్ధంగా పూర్ణ గురుదేవులు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు వివరిస్తున్నారు.
మనసు అంటే ఏమిటి? - శాస్త్రీయ దృక్కోణం

మనసు అనేదానికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైన నిర్వచనం లేదు.
సైన్స్ ఒకలా, మతం మరోలా, వేదాంతం ఇంకొకలా చెప్తూ, చివరికి అదేంటో తెలియక మనసంటే మాయ - జీవితమే మిధ్య అని ప్రచారం జరిగింది. దేనినైనా ఒకదానిని మార్చాలంటే, ముందు అది ఏమిటో తెలియాలి. ఇక్కడ ప్రస్థాన సాధన పేరుతో వ్యక్తి యొక్క మనసును మంచిగా పరివర్తన చెందించడమే లక్ష్యంగా సాగుతున్నందున, ముందు మనసు గూర్చి ఒక స్పష్టమైన నిర్వచనం కావాలి. అందుకే శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు ఆ మనసు మూలంలోని ప్రశ్నల చిక్కుముడిని విప్పారు. మనసు అంటే ఏమిటో, సుస్పష్టంగా నిర్వచించారు. సూక్ష్మంగా చెప్పాలంటే, మనసు అంటే మరేమో కాదు, “జ్ఞానేంద్రియాల స్పందనకు మెదడులో కలిగే ప్రతిస్పందన ద్వారా కలిగే భావన మనసు”.
శాస్త్రీయంగా చెప్పాలంటే, మనిషిలోని ఐదు ఇంద్రియాలు (సెన్సెస్), ప్రకృతి పరిసరాలతో అనునిత్యం అనుసంధానమై ఆ సమాచారాన్ని, నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు తీసుకువెళ్తాయి. ఈ ఇంద్రియ సమాచారానికి, మెదడులోని నాడీ కణాలు (న్యూరాన్స్), ప్రతిస్పందించి ఒక భావనను సృష్టిస్తాయి. ఆ భావన ఆలోచన రూపంలో “మనసు”గా వ్యక్తమవుతుంది అనే సరికొత్త విషయాన్నీ, వివరణను ఆవిష్కరించారు.
మనసును మార్చడం సాధ్యమేనా?
మనసును గురుంచి మరొక సంచలనాత్మక విషయమేమిటంటే, “మనసు” అనేది మనిషిలో స్థిరంగా ఉండదు, అది ఎప్పటికప్పుడు, అప్పటి అవసరాల మేరకు ఏర్పడుతుంది” అనే విషయాన్నీ కూడా శాస్త్రీయంగా వివరించారు. కాబట్టి మనసును మార్చుకోవడం సాధ్యమే.
మరి మనసు ఏర్పడుతుంది అని తెలిసాక, దానిని మార్చడానికై ఒక విధానం కావాలి. అదే పూర్ణ గురుదేవులు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు సూచించిన ఈ “ప్రస్థాన సాధన” విధానం ఈ విధానంలో, మనసును ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ప్రస్థానం చెందించవచ్చునని వారే స్వయంగా ఆచరించి నిరూపించారు. జన్మతః వచ్చిన భౌతిక ఇంద్రియ మనసు, మంచిగా - చెడుగా ఉంటుందనీ, సాధన ద్వారా మంచిని మాత్రమే పెంచుతూ, చెడును, ఆ మేరకు తగ్గిస్తూ..., మానవత్వాన్ని మనిషిలో పెంచవచ్చుననీ, తద్వారా ఆత్మీయతా సమాజాన్ని స్థాపించవచ్చని గురువు గారు బోధిస్తున్నారు.

ప్రస్థాన సాధన విధానంలో, మనసును మార్చే లక్ష్యంతో, కృషి, సాధన జరిగినట్లయితే, మనసు మారుతుంది, మనిషి మారతాడు, జీవితం మారుతుంది, సమాజం మారుతుంది. “మానవతా మనిషి - ఆత్మీయతా సమాజం” స్థాపించే లక్ష్యంతోనే ప్రస్థాన సాధనను పూర్ణ గురుదేవులు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు ఆవిష్కరించారు. నేటి సమాజ పరిస్థితులకు ఇది అంత్యంత అనుసరణీయం.

