స్ఫూర్తి గురుపీఠము
శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు వైజ్ఞానిక ఋషి మరియు ఈ భువిపై నడయాడిన పూర్ణగురువులు. 1941లో భౌతిక అవతరణ పొందిన శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు, సుమారు 1990ల వరకు వారి వద్దకు వచ్చిన వారికి భౌతిక సమస్యలకు వారి దివ్యశక్తితో సాంత్వన కలిగించేవారు. ఆ తరువాత, శ్రీ గురుదేవులు ప్రత్యక్ష దర్శనము బహు అరుదుగా లభించేది.
కానీ వారి భౌతికంగా ఉన్న ప్రదేశంలో వారి జీవిత వ్యవహారాలను కొనసాగిస్తూనే, వారు ప్రవేశపెట్టిన ఒక అపూర్వ దివ్య ‘మీడియం’ విధానం ద్వారా వేరువేరు ప్రదేశాలలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చిన భక్తులకు, శిష్యులకు, పరోక్ష విధానంలో అందుబాటులో ఉండేవారు. ఒకే సమయంలో వేరు వేరు ప్రదేశాలలో మాట్లాడుతూ - వారి ‘సర్వవ్యాప్తత’నూ; వచ్చిన వారి భూత భవిష్యత్ వర్తమాన జీవిత విషయాలను పరామర్శించి, తగు సూచనలు చేస్తూ - వారి ‘సర్వజ్ఞత’నూ; దుర్లభమైన ఆరోగ్య సమస్యలనుండి కాపాడుతూ, సంతానలేమి ఉన్నవారికి సంతాన యోగాన్నీ కలిగిస్తూ వారి ‘సర్వశక్తివంతత’నూ సగటు మనిషి అనుభవానికి తీసుకువచ్చారు ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు.

ప్రత్యక్షంగా శ్రీ గురుదేవులను ఒక ప్రదేశంలోనే కలవాలి అనే పరిమితి నుండి మీడియం విధానం ద్వారా అనేక ప్రదేశాలలో వారి ఆధ్యాత్మిక కేంద్రాలలో కలిసే అవకాశమును అనుగ్రహించారు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు.
శ్రీ గురుదేవుల భౌతిక నిష్క్రమణకు కొద్ది సంవత్సరాల ముందు, ‘మీడియం’ విధానానికి కూడా స్వస్తి పలికి, వారి భక్తుల స్వగృహముల యందు ‘స్ఫూర్తి గురుపీఠము’లను స్థాపించుకొనుటకు అనుమతిని ఆశీస్సులను అనుగ్రహించి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వాధారమైనటువంటి విశ్వశక్తి స్వరూపముతో గురుపీఠములయందు కొలువై యుండి, ఇప్పటికీ కేవలం వారి దివ్యచిత్రరూపం వద్ద నివేదించినంతనే భక్తులకు, శిష్యులకు ఆయా విషయాలకు సమస్యలకు పరిష్కారమార్గములను అనుగ్రహిస్తున్నారు.
గురుపీఠముల వద్ద శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు అనుగ్రహించిన విశ్వశక్తి సంబంధ మూలమంత్రయుక్త ప్రస్థాన సాధన చేయు సాధకులకు భౌతిక ఆధ్యాత్మిక దివ్య మార్గదర్శకత్వాన్ని అనుగ్రహిస్తున్నారు. విశ్వమాత స్వరూపులైన శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు భౌతికంగా నిష్క్రమించినప్పటికీ, మహిమాన్వితమైన ఈ గురుపీఠముల ద్వారా మానవ జాతికి ఎప్పటికి అందుబాటులో ఉంటున్నారు.

